|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:41 PM
సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్ శ్రీసాయి సంతోషి నగల దుకాణలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనుక వైపు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు 18 కిలోల బంగారు ఆభరణాలు, 40 తులాల బంగారు బిస్కెట్లు, రూ.19.50 లక్షల నగదు అపహరించారు. ఘటన జరిగిన విధానాన్ని బట్టి దుకాణం లోపల పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యజమాని తెడ్ల కిశోర్, పోలీసుల వివరాల ప్రకారం.. నగల దుకాణాన్ని శనివారం రాత్రి మూసివేశారు. ఆ సమయంలో షాపులోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లను దుకాణం వెనుకభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోని బీరువాలో యజమాని భద్రపరిచారు. ఇంకొన్ని బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలోని షోకేసుల్లో అలాగే ఉంచారు. ఆదివారం షాపు తెరవలేదు. సోమవారం ఉదయం షాపు తెరిచిన యజమాని కిషోర్ బంగారు ఆభరణాలు భద్రపరిచిన గదిలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి షాక్ అయ్యారు. గదికి ఏర్పాటుచేసిన ఇనుప షట్టర్, బంగారు ఆభరణాలు భద్రపరిచిన బీరువా గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి ఉంది. బీరువాలో భద్రపరిచిన ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, నగదు కనిపించలేదు. దుకాణం లోపలి భాగంలోని మరుగుదొడ్డి గోడకు రంధ్రం కనిపించింది. అంటే.. వెనుక భాగం నుంచి మరుగుదొడ్డిలోకి, అక్కడి నుంచి.. దుకాణం గదిలోకి దొంగలు ప్రవేశించారు. షట్టర్‌ను, బీరువాను కత్తిరించేందుకు దొంగలు తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు ఘటనాస్థలిలో లభ్యమయ్యాయి. ఈ చోరీ శనివారం రాత్రి జరిగిందా? ఆదివారం రాత్రి జరిగిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ, డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. చోరీసొత్తును మూటగట్టుకొని.. వచ్చిన మార్గంలోనే పరారైన దొంగలు.. ఆ హడావుడిలో కొన్ని బంగారు ఆభరణాలు జారవిడిచారు. షాపు వెనుక వైపు మార్గంలో రెండు, మూడు తులాల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.