|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:39 PM
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్థానిక సంస్థల్లో పాగా వేయడం ద్వారానే సాధ్యమవుతుందని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని చూస్తున్నది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు స్థానిక ఎన్నికలు తొలి మెట్టుగా భావించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది బండి సంజయ్ కుమార్ కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రిగా తన పార్లమెంట్ స్థానంతోపాటు తన సొంత జిల్లా అయిన కరీంనగర్‌లో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించి భారీగా సభ్యత్వాన్ని నమోదు చేయించారు. పన్నా కమిటీలు, బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నాయకులతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా లబ్ధి పొందిన ప్రజల వివరాలను గ్రామస్థాయిలో ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలను కూడగట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకోవాలని చూస్తున్నారు.