|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:36 PM
దేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచే విషయంలో తెలంగాణను ఏఐసీసీ నమూనాగా తీసుకోనుందా? ఈ నమూనా చూపుతూ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తోందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశంపై తమ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏఐసీసీ భావిస్తోంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. 24న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయి.. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత, రాష్ట్రంలో కులగణన జరిగిన తీరును వివరించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిన సంగతిని ప్రస్తావించనున్నారు. అదే రోజు సాయంత్రం ఇందిరాభవన్‌లో జరగనున్న కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండు బీసీ బిల్లులకూ ఆమోద ముద్ర వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలను కోరనున్నారు.