|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:32 PM
ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, పాకాల సరస్సు పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి నదీ తీరాల్లోని ఇసుక అక్రమ తవ్వకాలు, నష్టాన్ని సమగ్రంగా బేరీజు వేస్తున్నామని తెలిపారు. నదుల పరిరక్షణ, ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ తదితర అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీజీపీసీబీ) వివరాల ప్రకారం గోదావరి నది ఒడ్డున ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని బదులిచ్చారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర గనుల శాఖ మైనింగ్ నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ అటవీ శాఖ నుంచి అందిన సమాచారం మేరకు నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా కింద వరంగల్ ప్రాంతంలో ఎటువంటి అటవీకరణ ప్రాజెక్టులు చేపట్టలేదన్నారు. జాతీయ నీటి పర్యవేక్షణ కార్యక్రమం కింద ప్రతినెలా పాకాల సరస్సు నుంచి నీటి నమూనాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.