|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:30 PM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుదిబండి వెంకటరెడ్డి (84) మృతిచెందారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం జీవీఆర్ ఆరాధన సంస్థను స్థాపించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరుకు వెళ్లిన ఆయన ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.సోమవారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి శివారులోని ఓ దాబా ఎదుట ఆగి ఉన్న బస్సును నల్లగొండ నుంచి నార్కట్‌పల్లి వైపునకు వస్తున్న డీసీఎం వ్యాను అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వెంకట్‌రెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ఉన్న మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంకటరెడ్డికి భార్య, ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వెంకట్‌రెడ్డి మృతి పట్ల ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా.మామిడి హరికృష్ణ సహా పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.