|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 05:10 PM
ఈ సంవత్సరం రుతుపవనాలు ముందే ప్రవేశించినప్పటికీ.. జులై మధ్య నాటికి కూడా హైదరాబాద్ సహా తెలంగాణ లోని చాలా జిల్లాలో అత్యల్ప వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. ఇదే పరిస్థితి ఉంటే ఎలా అని కంగారు పడుతున్న సమయంలో జోరు వానలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా వాతావరణ శాఖ నిపుణులు హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. మరి కొన్ని గంటల్లో హైదరాబాద్‌లో కుండపోత వాన కురవబోతుందని.. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని.. వీలుంటే త్వరగా ఇళ్లకు చేరుకోవాలని చెబుతున్నారు. ఆ వివరాలు
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేస్తున్నారు. నేడు అనగా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. అనగా 3 గంటల పాటు నగరంలో కుండపోత వాన కురుస్తుందని అంటున్నారు. పనుల మీద బయటకు వెళ్లిన వారు.. కుదిరితే సాయంత్రం 4.30 గంటల లోపు ఇంటికి చేరుకుంటే.. వర్షం, దాని వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
సోమవారం సాయంత్రం నాలుగున్నర తర్వాత నుంచి రాత్రి 8.30 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్క హైదరాబాద్ వెస్ట్‌లో తప్ప.. మిగిలిన మూడు జోన్లలో కుండపోత వాన కురిసింది. అయితే నేడు అనగా సోమవారం నాడు వెస్ట్‌లో కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లవద్దని.. వెళ్లిన వారు త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచిస్తున్నారు.
నేడు అనగా సోమవారం నాడు ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే కాక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దానికి సంబంధించిన మ్యాపులను కూడా పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జూన్ నెలలో సరైన వర్షపాతం నమోదు కాలేదని.. కానీ జులై నెలలో సగటున 174-243 మి.మీ. వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
జులైలో సుమారు వారం రోజులు వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అలానే హైదరాబాద్‌తో సహా తెలంగాణాలోని 33 జిల్లాల్లో జులై 17 నుండి 22 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇంతకు ముందే ప్రకటించారు. వారు చెప్పనట్లుగానే జోరు వానలు కురుస్తున్నాయి.