|
|
by Suryaa Desk | Sun, Jul 20, 2025, 08:07 PM
తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం (IMD) భారీ వర్ష సూచన విడుదల చేసింది. రేపు (జులై 21) మరియు ఎల్లుండి (జులై 22) రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డా. కె. నాగరత్నం హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఇది ఆయా ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
జిల్లాల వారీగా వర్ష సూచన..
ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. వర్షాలతో పాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారం (జులై 21) పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం (జులై 22) ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.