|
|
by Suryaa Desk | Sun, Jul 20, 2025, 04:17 PM
మారుతున్న కాలంతో పాటు నేరగాళ్ల పద్ధతులు కూడా మారుతున్నాయి. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, దొంగలు ఇప్పుడు ఆధునిక వ్యూహాలను, అసాధారణ పద్ధతులను అవలంబిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. ఊహించని మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు, ప్రజలకు సవాలు విసురుతున్నారు. గతంలో కేవలం విలువైన వస్తువులు, డబ్బులు, ఆభరణాలు మాత్రమే లక్ష్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు, దొంగలు తమ నేర స్వభావాన్ని విస్తరించి.. అరుదైన వస్తువులను, కొన్నిసార్లు జంతువులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ వినూత్న దొంగతనాల తీరు సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటన ఈ సరికొత్త నేర ధోరణికి నిదర్శనం.
నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలో ఒక విచిత్రమైన దొంగతనం చోటు చేసుకుంది. సాధారణంగా వాహన చోరీలు, ఇంటి దొంగతనాలు చూస్తుంటాం కానీ.. ఈసారి దొంగలు ఒక ఖరీదైన ఇన్నోవా కారును ఉపయోగించి రెండు ఆవులను అపహరించుకెళ్లారు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం అర్ధరాత్రి రాజేందర్, రాజవ్వకు చెందిన రెండు ఆవులు కనిపించకుండా పోవడంతో.. అవి ఎక్కడికి వెళ్లాయని రాత్రంతా వెతికారు. శనివారం ఉదయం 8 గంటల వరకు వాటి జాడ లభించలేదు. దీంతో దొంగతనం జరిగిందని అనుమానించి.. సమీపంలోని ఇళ్ల వద్ద అమర్చిన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.
ఆ సీసీ కెమెరా ఫుటేజీలో అవాక్కయ్యే దృశ్యాలు రికార్డయ్యాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట రోడ్డు పక్కన ఒక ఇన్నోవా కారును నిలిపి ఉంచి.. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఆవులను కారు వెనుక వైపు డోర్ తెరిచి లోపలికి ఎక్కించినట్లు స్పష్టంగా కనిపించింది. ఆవుల వంటి పెద్ద జంతువులను చోరీ చేయడానికి ఇన్నోవా కారును ఉపయోగించడం, పైగా వాటిని కారులో తరలించడం చూసి బాధితులు, స్థానికులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనం జరిగిన తీరు, దొంగల ధైర్యం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలాంటి విచిత్రమైన చోరీలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.