|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 11:55 PM
కొత్త వాహన రిజిస్ట్రేషన్‌లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇంతవరకు సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. రవాణాశాఖ కార్యాలయాల వద్ద రోజులు తరబడి వేచిఉంటూ, అప్పుడప్పుడు పని పూర్తికానట్టుగా అనిపించేది.
ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంటి నుంచి స్మార్ట్‌ఫోన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రీన్యూవల్ చేసే అవకాశం రవాణాశాఖ అందిస్తోంది. ద్విచక్రవాహనం, కారు వంటి వాహనాలు నడిపేటప్పుడు ఆ వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పర్యావరణ పత్రాలతో పాటు ముఖ్యమైనది డ్రైవింగ్ లైసెన్స్. వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే, తనిఖీ అధికారులు పట్టుకుంటే జరిమానా విధించబడుతుంది. చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ రీన్యూవల్ చేయడం మర్చిపోతుంటారు. కొత్తగా లైసెన్స్ పొందినప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఆ గడువు ముగిసే ముందు రీన్యూవల్ చేయడం అవసరం. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఆ గడువులో రీన్యూవల్ చేయకుంటే జరిమానా పడుతుంది. గడువు చాలా రోజులుగా దాటి పోయితే లైసెన్స్ రద్దు చేసే అవకాశముంది. అందుకే లైసెన్స్ గడువును చూసుకొని తగిన సమయానికి రీన్యూవల్ చేయించుకోవడం మంచిది. పాత కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండేది, కాని ఇప్పుడు అందరం ఇంటి నుంచి సులభంగా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.ముందుగా రవాణాశాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత “Renewal of Driving Licence” పై క్లిక్ చేయాలి. తర్వాత “Click here to book the slot” ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త విండోలో డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, ఆర్టీఏ కార్యాలయం చిరునామా, పుట్టిన తేది, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి “Get Details” పై క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసి కన్‌ఫర్మ్ చేయాలి. తర్వాత స్లాట్ కోసం మీకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని పరిశీలించి “Pay Now” పై క్లిక్ చేయాలి. అందులోని పేమెంట్ ఆప్షన్లలో మీకు తగినదాన్ని ఎంచుకుని చెల్లించవచ్చు. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ వైద్యుడు సంతకం చేసి, ఆధార్ కార్డు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు స్లాట్ బుక్ చేసిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. కొద్ది రోజుల్లోనే మీ రీన్యూవల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.