|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 11:15 PM
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం గల గ్రామాల పేర్ల మార్పుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. గతంలో బ్రహ్మగిరి, కృష్ణగిరిగా శ్రీశైలం చరిత్రలో ఉన్నప్పటికీ.. 1963లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అవి దోమలపెంట, ఈగలపెంట గ్రామాలుగా పిలువబడ్డాయి. ఇప్పుడు.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. దోమలపెంటను బ్రహ్మగిరిగా, ఈగలపెంటను కృష్ణగిరిగా ప్రభుత్వం అధికారికంగా మార్పు చేసిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.
అభివృద్ధికి ప్రణాళికలు..
దోమలపెంట (నూతన బ్రహ్మగిరి)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దోమలపెంట, ఈగలపెంట గ్రామాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల బోర్డులపై పేర్లను మార్పు చేయాలని ఇప్పటికే కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లాయని.. తాను కూడా అన్ని శాఖల అధికారులకు ఆదేశించానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. బ్రహ్మగిరిలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వపరంగా పలు అవకాశాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. పెట్రోల్ బంకు, సూపర్ మార్కెట్, జూట్ బ్యాగుల తయారీ, స్వగృహ వంటల తయారీ వంటి ప్రాజెక్టులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. బ్రహ్మగిరి, కృష్ణగిరి గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో నిర్మించిన క్వార్టర్స్‌ను నిరుపేదలకు క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసే వారి నుంచి స్థలాలను తిరిగి ఇరిగేషన్ శాఖకు అప్పగిస్తామని చెప్పారు.
శ్రీశైలం నుంచి బ్రహ్మగిరి వరకు గతంలో నడిచిన ఆత్మకూర్ డిపో బస్సును తిరిగి పునరుద్ధరించేటట్లు శ్రీశైలం ఎమ్మెల్యేతో మాట్లాడామని.. అందుకు వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధ, ఎంపీడీఓ లింగయ్య, ఐకేపీ ఏపీఎం నిరంజన్, మాజీ సర్పంచ్ చత్రునాయక్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్, పూరి శ్రీనువాసులు, నాయకులు హరినారాయణగౌడ్, మొయిజొద్దీన్ సిరాజ్, రసూల్, గురవయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.