|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 01:55 PM
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు రెండో రాజధాని అయిన వరంగల్‌లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 80 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి తలమానికంగా టెక్స్‌టైల్ పార్క్ కూడా రాబోతోందని తెలిపారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ సహా పలు నగరాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పాలకులంతా హైదరాబాద్ చుట్టూనే ఫోకస్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీను 20 ఉత్తరాలు రాసినా కూడా కేసీఆర్ వరంగల్ అభివృద్ధికి సహకరించలేదని కామెంట్ చేశారు. వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడా విమానాశ్రయాలు లేవన్నారు. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ విస్తరిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రధాని కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని రైల్వే శాఖకు ఆదేశాలను జారీ చేశారని పేర్కొన్నారు. పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రాజెక్టుకు మొదట రూ.330 కోట్లని అనుకున్నామని.. కానీ, బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొమురవెల్లి మల్లన్న పుణ్యేక్షేత్రంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్‌కు పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేశామని గుర్తు చేశారు. ఆ రైల్వే స్టేషన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని స్పష్టం చేశారు.
బనకచర్ల విషయంలో జోక్యం చేసుకుంటే.. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని.. ఒకవేళ పట్టించుకోకపోతే ఎందుకు మీకు ఆ అంశం అక్కర్లేదా అని కామెంట్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పుడు కేంద్ర జోక్యం ఉండొద్దా అని ఆయన ప్రశ్నించారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వదని, కేవలం ఫెసిలిటేటర్ మాత్రమేనని అన్నారు. ఏపీ, తెలంగాణ చర్చలను తప్పుబడుతోన్న బీఆర్ఎస్ గతంలో జగన్‌తో చర్చలు జరపలేదా అని ఫైర్ అయ్యారు. జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి గోదావరి జలాలను మళ్లిస్తామని చెప్పలేదా అని ఆక్షేపించారు. కేసీఆర్ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేశారు. ఆయనే సైంటిస్ట్, ఇంజినీర్, అధికారి, సీఎంగా వ్యహరించలేదా అని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు.
తెలంగాణ కేవలం 700 వందల టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకోలగదని కేసీఆర్ అన్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలని.. ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రం తీర్పును ఇవ్వదని అన్నారు. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అలా కాకుండా కిషన్ రెడ్డి కేసీఆర్‌కు సహకరిస్తున్నారనే కామెంట్లతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో బీజేపీ కేంద్ర ఎన్నటికీ వెనకడుగు వేయబోదని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.