![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 09:34 PM
టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో చేపట్టిన పునరుద్ధరణ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ చిరంజీవి దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని హైకోర్టు ఆదేశించింది.
చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ (నిలుపుగోడ) క్రమబద్ధీకరణ కోసం 2025 జూన్ 5న జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, జీహెచ్‌ఎంసీ ఈ దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2002లోనే జీ+2 ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని, ఈ నిర్మాణాలను తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. చిరంజీవి దరఖాస్తుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తుపై జీహెచ్‌ఎంసీ చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో పిటిషన్‌పై విచారణను మూసివేశారు. ఈ తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జీహెచ్‌ఎంసీ వేగవంతం చేయనుంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.