![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 07:53 PM
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్లను బీసీ డీ కేటగిరీ నుండి బీసీ ఏ కేటగిరీలోకి తక్షణమే మార్చాలని ముదిరాజ్ అధ్యయన వేదిక అధ్యక్షుడు, మాజీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో సోమవారం జరిగిన ముదిరాజ్ జెండా పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ముదిరాజ్ల జనాభా 60 లక్షలకు పైగా ఉందని.. అయినప్పటికీ వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముదిరాజ్ల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు తప్పనిసరని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా బీసీఏ కేటగిరీలో ముదిరాజ్‌లను చుర్చుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే బీసీఏలోకి ముదిరాజ్ లను చేర్చాలని డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. ముదిరాజ్ నాయకులు ఈ అంశంపై ప్రజాప్రతినిధులను కలుసుకొని వినతి పత్రాలను కూడా సమర్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి చెరువులో 18 ఏళ్లు నిండిన ముదిరాజ్లకు మత్స్యకార సొసైటీ సభ్యత్వాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల సభ్యత్వాల విషయంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా, జిల్లా మత్స్య అభివృద్ధి శాఖ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లు పెద్ద ఎత్తున పోటీ చేసి, రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది వారి సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు బొజ్జ నారాయణ, సలేందర్ శివయ్య, బోండ్ల గంగాధర్, బర్మ రాజనర్సయ్య, అనిల్, కిష్టయ్య, దర్శనం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డిమాండ్ నెరవేరితే ముదిరాజ్ సామాజిక వర్గం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించే అవకాశం ఉంది. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాల్లో ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా వీరు విస్తరించి ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వారి జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ముదిరాజ్‌ల జనాభా అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో మత్స్యకారులుగా, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే ముదిరాజ్‌లు ఎక్కువగా కనిపిస్తారు. అలాగే.. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కూడా వీరి ఉనికి గణనీయంగా ఉంటుంది.