|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 01:06 PM
హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా భారీగా వ్యాపించడంతో భవనంలో ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి భవనం లోపల ఉండలేని పరిస్థితి ఏర్పడటంతో కొందరు పై అంతస్తుల వైపు ఎక్కి సురక్షితంగా బయటపడేందుకు యత్నించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తక్షణమే రక్షణ చర్యలు ప్రారంభించారు. వేగంగా స్పందించిన ఫైర్ సిబ్బంది, నివాసితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇదే ఆదివారం ఉదయం చార్మినార్ ప్రాంతంలోని మీర్‌చౌక్‌లో జరిగిన మరో అగ్నిప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ ఘటన హైదరాబాద్‌ను దిగ్బ్రాంతికి గురిచేసింది. వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అగ్నిప్రమాదాలకు కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భవనాల్లో సురక్షిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.