యువ ఆవిష్కర్తలకు గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్
పటాన్‌చెరు;యువతలోని సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా యువ ఆవిష్కర్తలను ఆహ్వానిస్తూ, దాదాపు రూ.50 లక్షల నగదు పురస్కారాలను అందించనుంది.గీతం వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సౌజన్యంతో ఈ జాతీయ స్థాయి పోటీని నిర్వహిస్తున్నారు. ఆశాజనకమైన ఆలోచనలను ప్రభావవంతమైన, విస్తరించదగిన వ్యాపారాలుగా మార్చేందుకు యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించడం దీని ప్రధాన లక్ష్యం.10 నుంచి 12వ తరగతి విద్యార్థులు,అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 2025 నుంచి పట్టభద్రులైన యువత ఈ పోటీలో పాల్గొనవచ్చు. జూనియర్,సీనియర్ విభాగాల్లో నిర్వహించే ఈ ఛాలెంజ్‌లో నిజజీవిత సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించే ఆలోచనలను సమర్పించాల్సి ఉంటుంది.వాతావరణ మార్పులు, సుస్థిరత,వ్యవసాయం,ఫుడ్ టెక్నాలజీ,ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, డీప్ టెక్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రీడలు, ఫిట్‌నెస్, వినియోగదారుల ఉత్పత్తుల రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు నిపుణుల మార్గదర్శకత్వం, వెంచర్ కోచింగ్,ఇంక్యుబేషన్ అవకాశాలు కల్పించనున్నారు.సీనియర్ విభాగంలో రెండు లక్షల రూపాయల వరకు నగదు బహుమతులతో పాటు గీతం ఐ-టీబీఐలో ఆరు నెలల ఇంక్యుబేషన్ సదుపాయం అందించనున్నారు. జూనియర్ విభాగం ఫైనలిస్టులకు ఏడాది పాటు వ్యక్తిగత వెంచర్ కోచింగ్ కల్పించనున్నారు.ఆన్‌లైన్ స్క్రీనింగ్, వర్చువల్ బూట్ క్యాంప్,మార్గదర్శకత్వం అనంతరం ఈనెల 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ సెమీ ఫైనల్స్ నిర్వహించనున్నారు.డిసెంబర్ 11న గీతం హైదరాబాద్‌లో జాతీయ గ్రాండ్ ఫైనల్ జరగనుంది.పోటీలో పాల్గొనాలనుకునే వారు ఈనెల 7వ తేదీలోగా జీఐసీ పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి.వివరాలకు 90630 65811,83283 34930 నంబర్లను సంప్రదించవచ్చు. gic@gitam.eduకు ఈ-మెయిల్ చేయవచ్చు.