telangana
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు.
రోడ్డు భద్రతా చర్యల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.శనివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, గత సమావేశంలో చేసిన సూచనల అమలు పురోగతిని సమీక్షించారు.కమిటీ సభ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. జలంధర్ సమావేశ అజెండాను వివరించి, గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు వివరాలను వెల్లడించారు.జిల్లాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రమాద సూచిక బోర్డుల ఏర్పాటు, వాహనాల వేగ నియంత్రణ, రహదారులపై స్పష్టమైన మార్కింగ్‌లు, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాదచారుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.రోడ్డు భద్రత విషయంలో పోలీసు, రవాణా, రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, జాతీయ రహదారుల విభాగం తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.ఈ సమావేశంలో పోలీసు, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, జాతీయ రహదారుల విభాగాలకు చెందిన అధికారులు, కమిటీ సభ్యులు, ఆర్టీయే సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.