రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం
జూలూరు పీఏసీఎస్ చైర్మన్ కళ్ళెం రాఘవరెడ్డి
భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి దళారుల చేతిలో మోసపోవద్దని జూలూరు పీఏసీఎస్ చైర్మన్ కళ్ళెం రాఘవరెడ్డి అన్నారు. శనివారము భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు పిఎసిఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగ అనంతరం పీఏసీఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.ప్రస్తుతం కొందరు వ్యాపారులు క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,200కే కొనుగోలు చేస్తున్నారని, రైతులు తొందరపడి తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టి నాణ్యతగా సిద్ధం చేసుకుని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినా, అవసరమైతే గోదాములకు తరలించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తుఫాను వచ్చే అవకాశం ఉంటే రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.