ప్రజావాణిలో ఖాళీ కుర్చీలు.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం…!
బషీరాబాద్, మేజర్ న్యూస్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం బషీరాబాద్ మండలంలో నామమాత్రంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజావాణి లక్ష్యం నీరుగారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక్క వెటర్నరీ వైద్యుడు మినహా ఇతర శాఖలకు చెందిన అధికారులు హాజరుకాలేదని సమాచారం. దీంతో ప్రజల ఫిర్యాదులను స్వీకరించాల్సిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలనే ఆశతో కార్యాలయానికి వచ్చిన ప్రజలకు నిరాశే ఎదురైంది. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఫిర్యాదులు అందించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికే అధికారులు హాజరుకాకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల గోడు వినాల్సిన అధికారులే అందుబాటులో లేకపోతే తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రజల పట్ల వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ప్రజావాణికి గైర్హాజరైన అధికారుల తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్:పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.