పేదింట వెలిగిన దీపావళి దీపాలు!
ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి పండుగ వేడుకలు
సూర్య, లక్షెట్టిపేట, :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపుతోంది. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు చింత సువర్ణ అశోక్ కుమార్.. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు పర్వతోజు అనిత, తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చింత సువర్ణ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన నిరుపేదలకు సొంతింటి భాగ్యం కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇంట్లో ఒక నిరుపేద కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నిండినప్పుడే పండుగకు నిజమైన సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కల్లెడ రాజశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు నక్క జాకబ్, 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తూరి రవీందర్, సుగుణకర్ వసంత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.