నవ సాంకేతికతతో పోగొట్టుకున్న మూడు ఫోన్లు రికవరీ : కే. మహేందర్ రెడ్డి
మాగనూర్ మేజర్ న్యూస్ :
పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెలికితీసి తిరిగి బాధితులకు అందజేయడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోందని మాగనూర్ ఎస్సై కే. మహేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల పోగొట్టుకున్న మూడు ఖరీదైన సెల్ ఫోన్లను ఆధునిక సాంకేతికత సహాయంతో రికవరీ చేసిన పోలీసులు, ఆదివారం పోలీస్ స్టేషన్‌లో బాధితులకు ఎస్సై వాటిని సురక్షితంగా అందజేశారు.
కొత్తపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మొబైల్ వివరాలను నూతన సిఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ పోర్టల్ ఆధారంగా ఫోన్లను సులభంగా ట్రేస్ చేసి, త్వరితగతిన రికవరీ చేయగలిగినట్లు ఎస్సై వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ "ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో, సమాచార మార్పిడిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన భాగమైంది. ఫోన్ పోయిందని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
ముఖ్యంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానమైన సిఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా కొన్ని రోజుల వ్యవధిలోనే ఫోన్ల లొకేషన్‌ను కనుగొని రికవరీ చేయవచ్చు.అని అన్నారు. ప్రజలందరూ ఈ ఆధునిక సేవలను సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఫోన్లను తిరిగి పొందిన బాధితులు మాగనూర్ పోలీసుల సత్వర స్పందనకు, కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం