బంట్వారం,మేజర్ న్యూస్ :మండల పరిధిలోని నాగ్వారం, నాగ్వారం తండా గ్రామాల్లో శుక్రవారం అధికారులు పర్యటించి విబిజిరాంజి పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాములు అధికారులు కలిసి పని ప్రదేశాలను సందర్శించి పనుల నాణ్యత, పరిమాణం, కూలీల వేతనాలు, చేపట్టాల్సిన పనుల జాబితా, పని ప్రదేశాల్లో కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌లతో కలిసి నిర్మాణంలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల భవనం, ఇంకుడు గుంతలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రస్తుతం ఉన్న పశువుల తొట్టెల స్థితిగతులను పరిశీలించారు. అదేవిధంగా గ్రామాల్లో కొత్తగా అవసరమైన పశువుల తొట్టెల నిర్మాణం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పట్లోళ్ల భాగ్యమ్మ, ఎంపీడీవో రాములు, ఎంపీవో నాగరాజు, ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, గ్రామస్తులు కర్ణాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.