నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి, అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య,
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బి. చెన్నయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. మహిళల ఆటపాటలతో సందడిగా మారిన వాతావరణం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య మాట్లాడుతూ....., బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతుందని తెలిపారు.తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే పండుగలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు.గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల భాగస్వామ్యంతో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మహిళల్లో ఉత్సాహాన్ని నింపాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ పూల పండుగ విశిష్టతను మరోసారి చాటిచెప్పాయి. కార్యక్రమంలో డిఆర్ఓ పాండు, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, అదనపు పిడి రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రవీందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ రూరల్, సూర్య న్యూస్