మంథని లో ముడుపుల దందా
మంథనిలో 'ముడుపుల' దందా: కమీషన్లు ముట్టితేనే కదులుతున్న ఫైళ్లు!
కాటారం మార్కెట్‌కు కమీషన్ల బ్రేక్.. కాళేశ్వరం పనులపైనే ఎమ్మెల్యే 20% గురి!
శ్రీధర్‌బాబుకు ఓట్ల వేట తప్ప.. నియోజకవర్గ ప్రజలతో అనుబంధం లేదు!
తమ్ముడి అకౌంట్లలోకి వేల కోట్లు.. మంథని నిరుద్యోగ యువతకు ఐటీ కంపెనీలేవీ?
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కమీషన్ల కక్కుర్తిని ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్!
కాటారం, సెప్టెంబర్ 30, మేజర్ సూర్య న్యూస్:
మంథని నియోజకవర్గంలో కమీషన్ల దందా నడుస్తోందని, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ముడుపులు ముట్టితేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని, లేదంటే అవి అర్ధాంతరంగా అటకెక్కుతాయని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట మధూకర్ నిప్పులు చెరిగారు. బుధవారం కాటారం మండల కేంద్రంలో ఏడాదినరగా పెండింగ్‌లో ఉన్న వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏడాది క్రితం కాటారంలో వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శిలాఫలకం వేసి ఆర్భాటంగా శంఖుస్థాపన చేశారని, కానీ ఏడాది గడిచినా నేటికీ ఆ పనులు పూర్తికాకపోవడం ఈ ప్రాంత ప్రజలను ఘోరంగా అవమానించడమేనని పుట్ట మధూకర్ మండిపడ్డారు. "ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాటారం ప్రజలు శ్రీధర్ బాబుకు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి అందలమెక్కిస్తున్నారు. కానీ, ఆయనకు ప్రజలతో కేవలం ఓట్ల బంధమే తప్ప పేగు బంధం లేదు" అని ఎద్దేవా చేశారు. 40 ఏండ్లుగా దుద్దిళ్ల కుటుంబానికి ప్రజలు ఎనిమిది సార్లు అధికారమిస్తే, పదవులు అనుభవించి వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప, ఈ ప్రాంత వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. సాక్ష్యాత్తు జిల్లా కలెక్టర్ సాక్ష్యంగా జరిగిన చిన్నకాళేశ్వరం రివ్యూ మీటింగ్‌లోనే ‘అధికారులు పనులు చేయకపోతేనే మాకు లాభం జరుగుతుంది’ అని మాట్లాడిన స్వార్థపూరిత చరిత్ర శ్రీధర్ బాబుదని దుయ్యబట్టారు.దక్షిణ కాశిగా పేరుగాంచిన పవిత్ర కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులను కూడా కమీషన్ల కోసమే వాడుకుంటున్నారని పుట్ట మధూకర్ సంచలన ఆరోపణ చేశారు. ఆ పనుల్లో 20 శాతం కమీషన్ వచ్చింది కనుకే పనులు మొదలుపెట్టారని, అదే నిరుపేదలు కూరగాయలు అమ్ముకునే మార్కెట్‌కు ఎలాంటి కమీషన్ రాకపోవడంతోనే పనులను గాలికొదిలేశారని ఆరోపించారు. "చిన్న మార్కెట్ నిర్మాణాన్ని ఏడాదిగా పూర్తి చేయలేని వాళ్ళు, ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా పూర్తి చేస్తారు?" అని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తున్నాయని, అప్పటికి ఆలయం పూర్తి కాకపోతే దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామివారి దర్శనం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధి కోసం కలెక్టర్ వద్ద రూ.100 కోట్ల నిధులు పెట్టిస్తానని చెప్పి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని నిలదీశారు.స్థానిక నాయకులు "ముఖ్యమంత్రి తర్వాత మా సారే" అని సంకలు గుద్దుకుంటూ సంబరపడుతున్నారని, కానీ ఆ సంతోషం కేవలం చెవులకు మాత్రమే పరిమితమని పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే తన తమ్ముడితో హైదరాబాద్‌లో నాలుగు ఆఫీసులు పెట్టించి ఇప్పటికే రూ.4,000 కోట్లు సంపాదించుకున్నారని, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నత చదువులు చదువుకుని నిరుద్యోగులుగా మారుతున్న యువత కోసం కనీసం ఒక్క ఐటీ కంపెనీ లేదా ఇండస్ట్రీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ మట్టిలో పుట్టిన తాము ప్రజల కోసం చేసే పోరాటాన్ని ఎన్ని కేసులైనా ఆపలేవని హెచ్చరించారు. మార్కెట్ లేక చిరువ్యాపారులు రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటూ నరకం చూస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి మార్కెట్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, సర్పంచ్ పంతకాని సడవలి, తోట జనార్ధన్, మర్కా రాము,రత్న సౌజన్య రెడ్డి, లక్ష్మీ చౌదరి, కొండ గొల్ల వెంకటస్వామి, నరివెడ్డి శ్రీనివాస్,జక్కు శ్రావణ్, మానేం రాజబాబు, టైలేని సతీష్, రామిల్ల రాజు,ఉప్పు సంతోష్, గాజుల విక్రం, కామెడీ ప్రమోద్, కొండపర్తి రవి, గంట శ్రావణ్, తూటి మనోహర్, మంతెన టోనీ, బోడ తిరుపతి, రమణ, చీమల వంశీ, జనగామ రాజబాబు, బొడ్డు రాజబాబు, చల్ల శేఖర్, మురహరి చారి, జిముడ వంశీ, సోదరీ రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, దుర్గం రాజేష్, తదితరులు పాల్గొన్నారు