లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు
• ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ కుమార్
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులను ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆడపడుచులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.