telangana
కోతుల దాడులతో ప్రజలు బెంబేలు..
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సయ్యద్ ఆవేజ్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సయ్యద్ ఆవేజ్ మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీల్లో కోతుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలపై కోతులు దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీధి వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాలు నిర్వహించుకునే వారికి కూడా కోతుల వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టి కోతుల బెడద నుంచి పట్టణ ప్రజలకు విముక్తి కల్పించాలని కోరారు.వినతిపత్రంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రజాక్, బీసీ/ఓబీసీ అధ్యక్షుడు దొండి హంస రాజు తదితరులు పాల్గొన్నారు.