కొంపల్లిలో ఉచిత ఏఐ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపు
మునుగోడు,మేజర్ న్యూస్:;జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP)లో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ – జోష్ (JOSH – Joint Squad for Health) కార్యక్రమం ఆధ్వర్యంలో మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొంపల్లి గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉచిత మొబైల్ ఏఐ (AI) చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, క్షయవ్యాధిని ముందస్తుగా గుర్తించి వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఆధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో కూడిన మొబైల్ చెస్ట్ ఎక్స్రే ద్వారా గ్రామ ప్రజలకు ఉచితంగా ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగిన వారిని గుర్తించి, తదుపరి వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు.ఈ శిబిరాన్ని కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమెట్ల నిర్మల దశరథ, ఉపసర్పంచ్ వేదిరె విజయేందర్ రెడ్డి సందర్శించి కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది గ్రామ ప్రజలకు క్షయవ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సపై అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా క్షయవ్యాధి పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత సమన్వయంతో పనిచేస్తే ‘టీబీ ఫ్రీ నల్లగొండ – క్షయరహిత నల్లగొండ’ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ జ్యోతి, సూపర్వైజర్లు అజయ్, సైదులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, టీబీ అలర్ట్ ఇండియా సిబ్బంది డీపీసీ ఇనాయత్, శ్రీనివాస్, వెంకన్న, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సిబ్బంది పాల్గొన్నారు.