కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి
మాగనూర్ సూర్య న్యూస్ :
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే పేదరికం ఎప్పటికీ అడ్డంకి కాదని.. నమ్మకమే నిజమైన బలం అని నిరూపించింది ఆ గ్రామీణ యువతి. తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని కళ్లజూసి, తాను కూడా తోడుగా నిలుస్తూ అహర్నిశలు శ్రమించి వైద్యురాలిగా సమాజానికి సేవ చేయాలనే కలను నిజం చేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన మాగనూర్ గ్రామానికి చెందిన బులిమెని మాధురి ఎంబీబీఎస్ సీటు సాధించి ఊరందరిచేత 'శభాష్' అనిపించుకుంటోంది.
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన బులిమెని ఆంజనేయులు, ఆయన భార్య ఏకైక ధ్యేయం కూతురిని ఉన్నతంగా చదివించడమే. తండ్రి ఆంజనేయులు వ్యవసాయం చేసుకుంటూనే, చిన్న చిన్న కరెంట్ రిపేర్లు (ఎలక్ట్రికల్ పనులు) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. కష్టాల్లో ఉన్నా కూతురి చదువుకు ఏనాడూ లోటు రానివ్వలేదు ఆ దంపతులు.
మాధురి చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచింది. ఏడో తరగతి వరకు మాగనూర్‌లోని 'ప్రతిభ పాఠశాల'లో, 8 నుంచి 10వ తరగతి వరకు మక్తల్‌లోని 'బ్రిలియంట్ పాఠశాల'లో విద్యనభ్యసించింది. అనంతరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.
నీట్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి 470 మార్కులు సాధించిన మాధురి, వనపర్తి మెడికల్ కాలేజీలో ఉచిత (ఫ్రీ) ఎంబీబీఎస్ సీటును కైవసం చేసుకుంది.సమస్యలను వంకగా చూపకుండా, కష్టాలనే ఇంధనంగా మార్చుకుని విజయం సాధించిన మాధురి విజయం పట్ల మాగనూర్ గ్రామంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఎంతోమంది గ్రామీణ విద్యార్థులకు, నిరుపేదలకు ఆమె విజయం ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు. మాధురిని, ఆమె తల్లిదండ్రులను పలువురు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం