telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రజలకు వరం
సూర్య నిజాంసాగర్ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రజలకు వరం లాంటిదని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా కుటుంబ యజమాని మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందజేస్తారని తెలిపారు.గ్రామాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఈ పథకం పై అవగాహన కల్పించి, నమోదు చేయించాలని సూచించారు. కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవాలనే మంచి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇలాంటి గొప్ప పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పథకంలో నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేయూత పింఛన్లను మంజూరు చేసిందని, మంజూరైన పింఛన్ల డబ్బులు నేరుగా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా ఇళ్లు మంజూరవడంతో నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో పూరి గుడిసెలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం కొనసాగుతోందని ఆ పథకం ద్వారా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందుతాయి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మంద బలరాం, బంగ్లా ప్రవీణ్ కుమార్, బంజపల్లి గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాండ్ల రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.