ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలి…..మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి
కొల్చారం;ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి సూచించారు. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు నిర్వహించిన అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పచ్చిరొట్టె పంటలు, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలను వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు.అలాగే మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ప్రతాపరెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.