దుద్దెడలో 5కే రన్ కు విశేష స్పందన
కొండపాక
"సే నో టు డ్రగ్స్" అనే నినాదంతో దుద్దెడ వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. యువత, విద్యార్థులు, ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యం తీసుకురావడమే ప్రధాన అజెండాగా ఈ రన్ ను నిర్వహించినట్లు నిర్వాహకులు బాకీ ప్రభాకర్, పెద్దంకుల శ్రీకాంత్, వడ్లకొండ శ్రీనివాస్, నర్ర సంతోష్, ఖలీల్, తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రీ టౌన్ ఎస్ఐ, దుద్దెడ గ్రామ సర్పంచ్ శివకుమార్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు, వక్తలు మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సాయంత్రం అయితే మైదానాలన్నీ పిల్లల కేరింతలతో కళకళలాడేవని, ఇప్పుడు మైదానాలన్నీ బోసిపోయాయని, పిల్లలంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య సెల్ ఫోన్ లో మునిగి తేలుతున్నారన్నారు. గంటల తరబడి రీల్స్, గేమ్స్ చూడటం వల్ల ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటోందనీ, చదువుపై శ్రద్ధ తగ్గి, ఒంటరితనం, చిరాకు పెరిగి తల్లిదండ్రుల మాట వినడం లేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సెల్ ఫోన్లు వదిలి క్రీడా ప్రాంగణాల్లో సమయం గడపాలని, క్షణిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు వెళ్లకుండా, రన్నింగ్, వాకింగ్, ఆటలు వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.