telangana
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సూర్య, మంచిర్యాల టౌన్ : విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం, బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని దశాబ్దాలుగా కోరుతున్నా, జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతమే ఉందని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని, బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపురి భీమ్సేన్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, పడాల శివతేజ, ఎండీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.