అరెంపులలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
పూల పండుగలో మహిళల సందడి.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో బండి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపసర్పంచ్ షేక్ దావూద్, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొని సందడి చేశారు.
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, ఐక్యతను చాటారు.
తెలంగాణ అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని పలువురు పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు తెలంగాణ సంస్కృతిని అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పూల సౌరభం.. పాటల సందడి.. సంప్రదాయాల వైభవం.. అరెంపులలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవం!