పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం!
చౌటుప్పల్, మేజర్ న్యూస్: మండలంలోని ఆరేగూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని పూల రూపంలో ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల్లో ఐకమత్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు, యువతులు కలిసి ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు.
గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి పండుగలను జరుపుకోవడం ద్వారా సోదరభావం, ఐక్యత మరింత బలపడతాయని ఆమె పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు.