ఆరుతడి పంటలు సాగుతో మేలు
ఆరుతడి పంటల సాగుతో మేలు
పొలంబడిలో రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన
మంచాల : రైతులు శాస్త్రవేత్తలుగా మారి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) శశిధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మంచాల మండలం నోముల గ్రామ పరిధిలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు పంటల సాగు, తెగుళ్ల నివారణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు ప్రతిరోజూ తమ పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, పోషక లోపాలు, పురుగుల ఉనికి, తెగుళ్ల లక్షణాలను నిశితంగా పరిశీలించాలని ఏడీఏ సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. యాసంగిలో ఆరుతడి పంటలైన జొన్న, కుసుమ, పెసర, మినుములు, శనగలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గుడ్డు, సువ్వలు, కూరగాయలు సాగు చేసుకోవాలని వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ప్రస్తుతం వరి పంట గింజ పాలుపోసుకునే దశ నుంచి కోత దశకు చేరుకుంటోందని, ఈ సమయంలో కంకి నల్లి, సుడిదోమ, అగ్గి తెగులు లక్షణాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. విత్తనాలు ఎంపిక చేసుకున్నప్పుడే విత్తనశుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా జిల్లాలోని ఏ సీసీఐ కేంద్రంలోనైనా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి సిరి, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల