ఆర్నబ్ తుఫానుపై అప్రమత్తం.. అధికారులకు అలర్ట్
*ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యం.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
*లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి – మున్సిపల్ చైర్‌పర్సన్
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో తుఫాను సన్నద్ధత, విపత్తు నిర్వహణ చర్యలపై అధికారులతో చర్చించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని, చెరువులు, కాలువలు, వాగులు, మున్నేరు నది నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మురుగునీటి కాలువల్లో అడ్డంకులు తొలగించి వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకర విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖకు సూచించారు.
ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, వార్డు అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖకు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల సమీపంలో ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అధికారిక వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్,తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ , ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్ , రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు , వార్డు అధికారులు, మండల విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.