విమర్శలు మాని అభివృద్ధికి సహకరించండి -- మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి
*నారాయణపేట, సూర్యన్యూస్ :* బురద చల్లటం, విమర్శలు చేయడాన్ని ప్రతిపక్షాలు మానుకుని ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరిస్తూ కలిసి పని చేయాలని మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి కోరారు. పట్టణంలోని సివిఆర్ భవన్ లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ఆశయ సాధన, యువజన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర మాజీ నాయకులు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి ఆలోచనలతో నారాయణపేట ప్రాంత ప్రజలకు అండగా వారి వారసురాలు చిట్టెం ఫర్నికా రెడ్డి పనిచేస్తున్నారని, తొలి సారి గెలిచినా, ఒక మహిళా ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఇతర నాయకుల కంటే ఎక్కువ పనిచేస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనుల విషయంలో శిలపలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనే హడావిడి లేకుండా ప్రచార ఆర్భాటం లేకుండా ముందుకుపోతున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి పర్ణిక రెడ్డి కి అండగా అధికార దర్పం లేకుండా కలిసి పనిచేస్తున్న వారిపై అనవసరంగా షాడో ఎమ్మెల్యేలు అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఎన్నో సంవత్సరాల కలను నెరవేరుస్తూ జీఓ 69 విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఎక్కడ కూడా లంచాలు తీసుకోకుండా అధికారులు, నాయకులు పారదర్శకంగా రైతులకు డబ్బులు అందిస్తున్నామని చెప్పారు. ధన్వాడ చెరువు కోసం రీ డిజైన్ లో మార్పులు చేసినమని అప్పిరెడ్డిపల్లి చెరువుకు నీరు తరలించడంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగదన్నారు. నిజమైన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే శిఖం, కంఠం భూమిలో కబ్జాలో ఉన్న బడా బాబులు అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. నియోజకవర్గానికి విద్యా, వైద్యంతో పాటు పారిశ్రామిక రంగంలోనూ అడుగుపెట్టించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం, భూసార కేంద్రం తదితర అంశాలపై దృష్టి సాధించామని, రైల్వే లైన్, రహదారుల విస్తరణతో వాణిజ్య రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మాడల్ బస్టాండ్ గా నారాయణపేట, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాలకు పక్కా భవనం, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించే పనులు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సదాశివరెడ్డి, సలీం, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
*-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*