వికారాబాద్ జిల్లాలో పోలీసుల మెరుపు నాకాబందీ.. 1,677 వాహనాల తనిఖీ, 150 కేసులు నమోదు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల కట్టడి, రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 1,677 వాహనాలను పరిశీలించి, 150 కేసులు నమోదు చేశారు.జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు పోలీస్ డివిజన్ల పరిధిలో ఉన్న 20 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 36 తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలను ఆపి, వాహనదారుల ధ్రువపత్రాలు, వాహనాల వివరాలను పరిశీలించారు.నాకాబందీ సందర్భంగా మొత్తం 1,677 వాహనాలను తనిఖీ చేయగా, 71 డీడీ కేసులు, 79 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రాధాన్యత అని, జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం తనిఖీలు, నిఘా కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.