వికారాబాద్ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి
ధారూర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ధారూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల అభివృద్ధి, ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అభిమానులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్: సుధాకర్, ధారూర్, వికారాబాద్ జిల్లా.