telanagana
ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా.. యువతకు కౌన్సెలింగ్
సూర్య, పెంచికల్పేట్:సద్దుల బతుకమ్మ పండుగ వేళ రహదారి భద్రతకు విఘాతం కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలపై పెంచికల్పేట్ పోలీసులు కొరడా ఝళిపించారు. ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న యువతపై ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, సంబంధిత యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్‌తో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పండుగ వేళ యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి సరైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతను కాపాడటం, రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.