తెలంగాణలో మళ్లీ వానలు: పలు జిల్లాలక భారీ వర్ష హెచ్చరిక
హైదరాబాద్:రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేళ, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాగల కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
వర్ష సూచన ఉన్న ప్రధాన జిల్లాలు:
* భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు..
* మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* అలాగే రాజధాని ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సూచనలున్నాయి.
వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.