తెలంగాణలో కొత్తగా 41 బార్లకు నోటిఫికేషన్.. హైదరాబాద్‌లోనే 14 ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
సూర్య తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా బార్ లైసెన్సుల మంజూరుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 కొత్త 2బీ బార్ల ఏర్పాటుకు అర్హులైన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు ప్రకటించారు. ఈ కేటాయింపుల్లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మరియు మల్కాజిగిరి పరిధిలోని అర్బన్ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. అధికారిక వివరాల ప్రకారం మొత్తం 41 బార్లలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన టీసీయూఆర్ పరిధిలోనే 14 బార్లను ఏర్పాటు చేయనున్నారు.
మిగిలిన 27 బార్లను రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలో మంజూరు చేయనున్నారు. ఈ లైసెన్సుల కోసం ఒక్కో దరఖాస్తుకు నాన్-రీఫండబుల్ ఫీజుగా లక్ష రూపాయలను నిర్ణయించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంబంధిత ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ప్రాంతం మరియు జనాభా ప్రాతిపదికన వార్షిక లైసెన్స్ రుసుము 30 లక్షల నుంచి 44 లక్షల రూపాయల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత పారదర్శక పద్ధతిలో లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి బార్ లైసెన్సులు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.