telanagana
పుట్టపహాడ్ లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై వివాదం
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 15):కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు గురువారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్న గ్రామస్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని అంజిలయ్య మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల విషయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు నచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపించారు. సొంత ఇళ్లు లేని పేదలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్కు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారుల జాబితాను రూపొందించడం ఏమిటని ప్రశ్నించారు.రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు. పుట్టపాడు గ్రామాన్ని ఎమ్మెల్యే చిన్నచూపు చూడకుండా మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రెండో విడతలో కేటాయించిన ఇళ్ల జాబితాను పరిశీలించి, అనర్హుల పేర్లు ఉంటే తొలగించి, అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం జరగకపోతే గ్రామస్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించి, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి, వార్డు సభ్యులు జి. శైలజ, సి. అశ్విని, బి. బిక్షపతి, జె. విష్ణువర్ధన్, ఎస్. మారుతి, గ్రామ నాయకులు ఉప్పరి కృష్ణయ్య, ఉప్పరి వెంకటయ్య, గొల్ల మొగులయ్య, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జక్కులపల్లి కృష్ణయ్య, జంపల రాములు, సన్రాజ్ శీను, ఉప్పరి వెంకట్ రాములు, గాండ్ల వెంకట్ రాములు, కరిగల్ల నరసింహులు, సంగం నర్సింలు, కాకి రాములు, తమ్మలి యాదయ్యతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.