పూల పరిమళంలో.. బతుకమ్మ సందడి* *- జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకలు*
*పూల పరిమళంలో.. బతుకమ్మ సందడి*
*- జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకలు*
జిన్నారం :జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను ప్రిన్సిపల్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ ఆటపాటలు కళాశాల ఆవరణలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. వేడుకల అనంతరం విద్యార్థులు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి జిన్నారం అక్కమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. కళాశాల ఆవరణ నుంచి చెరువు వరకు ఉత్సాహంగా సాగిన కార్యక్రమం ఆకట్టుకుంది. బతుకమ్మ వేడుకల్లో విద్యార్థుల భాగస్వామ్యం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల వారి ఆసక్తిని చాటిచెప్పింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.