telanagana
ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు.. ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్
సూర్య,పెంచికల్‌పేట్: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని అగర్‌గూడ సమీప అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ‘కల్లు బాబా’ గుడి పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని అటవీ అధికారులు, సిబ్బంది తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం వల్ల వన్యప్రాణుల ఆవాసాలు కలుషితమై, మూగజీవాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. దర్శనాలు, విహారయాత్రల కోసం అడవులకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, సీసాలను అక్కడ పడేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పడవేసి పర్యావరణానికి హాని కలిగించే వారిపై అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలతో పాటు అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అస్మా, ఎఫ్‌ఎస్‌ఓలు అహ్మద్ అలీ, గోవిందు, బీట్ ఆఫీసర్లు సంగదీప్, కళ్యాణ్, లచ్చన్న, స్వర్ణలత, శిరీష, అనిమల్ ట్రాకర్స్ పాల్గొన్నారు.