ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి -ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి
-ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
-తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
పటాన్‌చెరు, పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ,పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి కోరారు.ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ హరిబాబు కు వినతిపత్రం అందజేశారు.నియోజకవర్గ పరిధిలో అర్హులైన పేదలు, మధ్యతరగతి ప్రజలు,కార్మిక కుటుంబాలకు చెందిన ఓట్లను ఫారం–7 ద్వారా తొలగిస్తున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని నరసింహారెడ్డి తెలిపారు.ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం,మృతుల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగడం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌ఓలపై ఒత్తిడి లేదా ప్రలోభాల ద్వారా ఓటరు జాబితాలో మార్పులు చేస్తున్నారన్న ఆరోపణలపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.ఫారం–7 ద్వారా వచ్చిన ప్రతి అభ్యర్థనను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే ఓటును తొలగించాలని,అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయి ఉంటే వెంటనే పునరుద్ధరించాలని కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 30 శాతానికి పైగా,సుమారు 90 వేల ఓట్లు తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని నరసింహారెడ్డి పేర్కొన్నారు.ఈ అంశంపై అధికార యంత్రాంగం స్పష్టతనిచ్చి,ఓటర్ల జాబితాపై సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరారు.ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని,అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఓట్ల తొలగింపులో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి,మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, కాంగ్రెస్ నాయకులు చంద్రయ్య, జంగయ్య,ఐఎన్‌టీయూసీ నాయకులు సుబ్బయ్య, మధుసూదన్‌రెడ్డి, మహేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.