క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం
జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్
మెదక్,: క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ పిలుపునిచ్చారు. 2030 నాటికి దేశాన్ని టీబీ రహిత భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు టీబీపై అవగాహన కల్పించడంతో పాటు, అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 13 టీబీ ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు తెలిపారు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు
టీబీ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని డీఆర్వో తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో జరిగే వైద్య శిబిరాల వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేసి అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 215 యాక్టివ్ టీబీ కేసులు
జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టీబీ కేసులు ఉన్నాయని అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. టీబీ రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం నిక్షయ్ పోషణ యోజన ద్వారా టీబీ రోగులకు పోషకాహారం కోసం నెలకు రూ.1,000 చొప్పున పూర్తి చికిత్స కాలం పోషణ భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా టీబీ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహార సహాయం అందించాలని కోరారు.వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే టీబీని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. రోగులను దూరంగా ఉంచకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని సూచించారు.
ఒక్కొక్కరు ఒక టీబీ రోగిని దత్తత తీసుకోవాలి
మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టీబీ రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఆర్వో సూచించారు.
గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేసి టీబీ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలన్నారు.టీబీ నిర్మూలనపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీబీ నివారణకు సంబంధించిన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800-11-6666ను సంప్రదించవచ్చని తెలిపారు.
టీబీ నిర్మూలనకు ప్రతిజ్ఞ
అనంతరం టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, క్షయ వ్యాధి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్‌సీసీ, మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.