కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి
*కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి*
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో నిర్వహించిన కోయ, గోండు భాషా వర్క్‌షాప్‌లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు వర్క్‌షాప్‌కు హాజరైన తాటికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు.
కోయ, గోండు భాషలకు ప్రామాణిక రూపం కల్పించడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న పదాలు, ఉచ్చారణలు, పదప్రయోగాల్లోని తేడాలను పరిశీలించి భాషను ప్రామాణీకరించడం వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. అలాగే కోయ, గోండు భాషల్లోని పదాలు, వాటి అర్థాలు, స్థానిక పదప్రయోగాలను సేకరించి సమగ్ర నిఘంటువు రూపొందించడం, ఆదివాసీ భాషలు, సంస్కృతులను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కోయ, గోండు భాషలకు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తింపు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రతినిధులు తాటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పార్లమెంట్‌లో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టే అంశంలో కూడా తన వంతు పోరాటం చేయాలని తాటి వెంకటేశ్వర్లును విజ్ఞప్తి చేశారు.
కోయ, గోండు భాషలకు అధికారిక గుర్తింపు కల్పించేందుకు చేపడుతున్న ప్రయత్నాలకు ఈ వర్క్‌షాప్ మరింత బలం చేకూరుస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఆదివాసీ భాషలు, సంస్కృతుల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు భాషను అందించేందుకు పిల్లలకు కోయ, గోండు భాషలను నేర్పేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వర్క్‌షాప్‌లో పాల్గొని ఆదివాసీ భాషల పరిరక్షణ, అభివృద్ధి, ప్రామాణీకరణపై చర్చించారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట