హైవే పేరిట అర్కోడ్ ప్రభుత్వ మట్టి గుట్టలు స్వాహా
*అనుమతి గోరంత.. తవ్వకం కొండంత..
*రాళ్లతో హైవే రోడ్డు నింపుతున్న పనులపై ప్రజల ఆందోళన
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : హైవే నిర్మాణం పేరిట ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి మేరకు తవ్వాల్సిన పరిమితిని మించి భారీగా మట్టి గుట్టలను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హైవే పనుల్లో గ్రావెల్ ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా.. పెద్ద సైజు రాళ్లను భారీగా పోసి, వాటిపై పలుచటి మట్టి పొర వేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీనివల్ల రహదారి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నిస్తే “మా ఇష్టం.. ఐదేళ్ల మెయింటెనెన్స్ మాదే” అంటూ సమాధానం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ మట్టి వనరులు దుర్వినియోగమవుతున్నాయా? హైవే పనుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్ద మొత్తంలో విలువైన మట్టి, రాళ్లను వినియోగిస్తూ ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఏఐ, మైనింగ్, రెవెన్యూ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతులకు మించి తవ్వకాలు జరిగాయా? రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా? అన్నది తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. తప్పులు నిర్ధారణైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.