దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, శామీర్‌పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు పీసరి మహిపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పూలబొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ బతుకమ్మ వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళలు, చిన్నారులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. సంప్రదాయ పాటలు, మహిళల కోలాహలంతో దేవరయాంజాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన పీసరి మహిపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మల్లారెడ్డి కళాశాల చైర్మన్ డాక్టర్ చామకూర ప్రీతి భద్రారెడ్డి, స్థానిక నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్,శామీర్ పేట్ ,మేడ్చల్ జిల్లా.
Also Read: అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గరిసెల సురేందర్ ముదిరాజ్