బర్రెల దొంగల ముఠా అరెస్టు
చౌటుప్పల్, మేజర్ న్యూస్:బర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బర్రె, ఆటో, మొబైల్ ఫోన్లు, రూ.80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.మన్మధకుమార్ తెలిపారు.
వాహన తనిఖీల్లో పట్టుబడి..
చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం రెడ్డిబావి ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న
ఆటోను ఆపి తనిఖీ చేయగా..పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు ప్రాంతాల్లో బర్రెల దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
వరుస దొంగతనాలు..
ఆగస్టు 8న చౌటుప్పల్ రామ్‌నగర్ కాలనీలో రెండు బర్రెలు, మూడు దూడలను దొంగిలించి.. ఒక బర్రె, మూడు దూడలను విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. సెప్టెంబరు 11న కాటమయ్య కాలనీలో మరో బర్రెను అపహరించి కోదాడలో విక్రయించినట్లు తెలిపారు. అక్టోబరు 4న లింగారెడ్డిగూడెం శివారులోని బర్రెల షెడ్డుకు తాళం పగులగొట్టి ఒక బర్రెను అపహరించారు.
సంతకు తరలిస్తుండగా..
దొంగిలించిన బర్రెను చౌటుప్పల్ శివారులోని అటవీ ప్రాంతంలో దాచారు. మంగళవారం కోదాడ సంతకు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. నిందితుల సమాచారం మేరకు గతంలో విక్రయించిన పశువులను కూడా పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు.
పోలీసుల విజ్ఞప్తి
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పశువుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ జి.మన్మధకుమార్ ప్రజలను కోరారు. ప్రజల భద్రత కోసం నిరంతరం వాహన తనిఖీలు, నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
నిందితులు: అడ్డాడి రాఘవేంద్రరావు, దాసరి యాదయ్య, అడ్డాడ శ్రీనివాసరావు, చాపల సైదులు.